ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘మేజర్’. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించాడు. శశి కిరణ్ తిక్క డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు.
తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. ‘మేజర్’ మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్‌కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్‌డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని మూవీ యూనిట్ పేర్కొంది.
https://www.instagram.com/p/CfDsUCRpOzt/?utm_source=ig_web_copy_link