ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, ఏజీ శ్రీరామ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ”చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదు. దిశ చట్టం అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి” అని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకు సుమారు రూ.2కోట్లు అవసరమవుతాయని ఈసందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. వారం రోజుల్లో డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసు విభాగంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యం నాలుగు రెట్లు పెంచేందుకు సమావేశంలో నిర్ణయించిన సీఎం.. అవసరమైన నిధుల కేటాయింపునకు ఆదేశించారు.