కాలం చెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయని, చేసే పని మారినా, పేరు మారని భావదారిద్ర్యంలో వ్యవస్థలు నడుస్తున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూమి శిస్తు వసూలు చేసే కాలంలో రెవెన్యూ శాఖ ఏర్పడిందని, భూమి శిస్తు అనే మాటే ప్రస్తుతం లేదని, రెవెన్యూ వసూలు చేసే పని పోయినా, ఆ శాఖకు రెవెన్యూ అనే పేరు పోలేదని అన్నారు. అదే విధంగా రెవెన్యూను కలెక్ట్ చేసే బాధ్యత పోయినా, కలెక్టర్ అనే మాట మారలేదు. ఇలాంటి అసంగతమైన విషయాలు చట్టంలో ఇంకా ఎన్నో ఉన్నాయి అని అన్నారు. ఫ్యూడల్ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు అలాగే ఉన్నాయని, భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్న సందర్భంలో ఈ లోపాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి అడ్డుగా మారాయని, ఈ నేపథ్యంలోనే రెవెన్యూ చట్టాన్ని పునరావలోకనం చేయడానికి, పునస్సమీక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నదని స్పష్టం చేశారు.
భూముల క్రయ విక్రయాలలో, పేరు మార్పిడిలో, వారసత్వ హక్కులు కల్పించడంలో, రిజిస్ట్రేషన్ సందర్భంలో ఏర్పడుతున్న అవకతవకల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైందని తెలిపారు. ఈ చట్టం అమలులో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆశిస్తున్నదని, ప్రభుత్వం, ప్రజలు సమిష్టి కృషితోనే ఆశించిన సంస్కరణ సాకారమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నానని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం ఈ మూడు శాఖలతో ప్రజలు సంబంధం కలిగి ఉంటారని, మనమంతా స్థిరచిత్తంతో, దృఢ చిత్తంతో ఈ మూడు శాఖల నుంచి అవినీతిని పారదోలేలా చేస్తే ప్రజలకు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయని వ్యాఖ్యానించారు.