HomeTelugu Big Storiesకరోనాకు సామాజిక దూరమే ఏకైక ఆయుధం

కరోనాకు సామాజిక దూరమే ఏకైక ఆయుధం

6a
తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 20వేల మంది పర్యవేక్షణలో ఉన్నారని.. వారి గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

”లాక్‌డౌన్‌కు మంచి సహకారం అందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సహకారం లేకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. అందరి బతుకులు ప్రమాదంలో పడేవి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈరోజు 10 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో దీనికి మందు లేదు.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో 11వేల వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 3వేలు ఉన్నాయి. ప్రస్తుతం వారి అవసరం మేరకు వారికి 30వేల వెంటిలేటర్లు కావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని వనరులూ ఉన్న అమెరికాలాంటి దేశమే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపులుగా రోడ్ల మీదకు రాకపోవడం, స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడం తప్ప మనకి గత్యంతరం లేదు. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి” అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

”అనేక మంది పరిశీలకుల అంచనా ప్రకారం అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ స్థాయిలో మనదేశంలో వైరస్‌ వ్యాప్తి చెందితే 20 కోట్ల మందికి కరోనా వైరస్‌ సోకే అవకాశముంటుందని చెబుతున్నారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ఆపత్కాల సమయంలో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా, ధైర్యంగా ఉంది. ఈ ఉదయం ప్రధాని మోడీతో మాట్లాడా. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ఏ సహకారానికైనా కేంద్రం తరఫున 100శాతం సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. గట్టిగా పోరాడుతున్నారని దాన్ని కొనసాగించాలని చెప్పారు. దీనిపై ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నాం. రాష్ట్రంలోని పరిస్థితిపై మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులతో చర్చించాం. ఒక్కోదశలో ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందిని ఉంచేలా..1400 ఐసీయూ సహా మొత్తం 12400 బెడ్లు సిద్ధం చేశాం. దీనికోసం వైద్యసిబ్బందిని సైతం కేటాయించాం. 60వేల పాజిటివ్‌ కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు వీలుగా చర్యలు చేపట్టాం. వ్యాధి విజృంభించినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.

”తప్పని పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నాం. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇప్పటికే వైరస్‌ చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది. దాన్ని మరింత నియంత్రణలోకి తీసుకురావాలి. ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లొద్దు. గుంపులుగా వెళ్లి సమస్యలు సృష్టించవద్దు. ఈ విపత్కర సమయంలో ఎవరూ ఆకలికి గురికావొద్దు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్ర ప్రజలైనా వారి పొట్టలు మేం నింపుతాం. హాస్టళ్ల బంద్‌లాంటివి ఏం ఉండవు. ఒక్క మనిషినీ ఉపవాసం ఉండనీయం. అందరికీ ఆహార వసతి ఏర్పాటు చేస్తాం. గృహనిర్మాణం, నీటిపారుదల సహా ఇతర రంగాల్లో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దీనిపై జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ఈ పరిస్థితుల్లో ప్రజల కదలికలు నిరోధించడమే ప్రధానం. ప్రధాని సైతం నాతో అదే చెప్పారు. ప్రజలకు మనవి చేస్తున్నా.. ఏ రకమైన నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. భయంకరమైన రాక్షసితో యుద్ధం చేస్తున్నాం. కొన్ని బాధలు ఎదురైనా భరించాలి. దయచేసి అధికారులు, పోలీసు, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలి. ప్రభుత్వంగా చేయాల్సిన ఎన్నో పనులు ఉంటాయి. ఈ పనులు చేస్తూనే ఇతర ఎన్నో వ్యవస్థలను సమీక్షించాల్సి ఉంటుంది” అని సీఎం వివరించారు.

”రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలు చేతికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జున సాగర్‌, జూరాల ఆయకట్టు కింద ఏప్రిల్‌ 10 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ నీళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి.. నేరుగా లేదా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో ఇస్తాం. రైతులు, ఆయా ప్రాంతాల శాసనసభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయంతో పంటలు చేతికందేలా చేసుకోవాలి. విద్యుత్‌ సిబ్బంది ఇప్పటి వరకు గొప్పగా పనిచేశారు. పంటలు చేతికందే వరకు కష్టపడాలి. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా కావాలి. నిత్యావసర సరకులు, కూరగాయలు, పశుగ్రాసం సహా అతిముఖ్యమైన వాహనాలకు అనుమతిస్తున్నాం. చాలా మంది చికెన్‌ తింటే ప్రమాదమని తప్పుడు ప్రచారం చేశారు. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెంపుకోసం సి విటమిన్‌ ఉండే పళ్లు తీసుకోవాలి” అని కేసీఆర్‌ సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu