భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. కరోనా కట్టడికి ప్రపంచమంతా పోరాడుతున్న ఈ తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని చెప్పినట్లుగా రేపు సాయంత్రం 5 గంటలకు మీ గుమ్మాల ముందు, కిటికీల ముందు, వరండాల్లోను నిలబడి దేశం కోసం సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది వంటి సేవకులకు కృతజ్ఞతలు తెలుపుతూ 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని అన్నారు. దేశ ప్రజల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా సమైక్యంగా ఎదుర్కొంటామనే సద్భావనను చాటేందుకు అందరూ ఐక్యం కావాలని అన్నారు. అందరూ రేపు సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలు పాటు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలపాలని అన్నారు.
జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సేవలను నిలిపేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కరోనాపై తెలంగాణ పోరాటం చేస్తోందని విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా కరోనా రాష్ట్రంలోకి కరోనా వస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారని, ఇప్పటి వరకు 11 వేల మందిని అదుపులోకి తీసుకున్నామని వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కొందరు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు 5 వేల పరిశీలన బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 21 మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు చెప్పారు. 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఐదుగురితో ఓ బృందం, అలాగే 78 మందితో జాయింట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే సమాజానికి ముప్పు తేవొద్దని.. మీరు కూడా మా రాష్ట్ర బిడ్డలే, స్వీయ నియంత్రణ పాటించండి అని విజ్ఞప్తి చేశారు. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలున్న వారు వెంటనే రిపోర్టు చేయాలని, మీరే స్వయంగా ఐసొలేషన్లో ఉండాలని అన్నారు. అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
రేపు 24 గంటల కర్ఫ్యూ పాటిస్తున్న నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కోసం 5 బస్సులను సిద్ధం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినీ అనుమతించబోమని చెప్పారు. ఎమర్జెన్సీ సిబ్బంది మినహా అందరూ కర్ఫ్యూలో పాల్గొంటారని, షాపులు, మాల్స్ కూడా మూసివేయాలని ఆదేశించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు కనీసం 3 వారాల పాటు బయటకు రావొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు.