Homeతెలుగు Newsతెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు: కేసీఆర్

తెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు: కేసీఆర్

10 4

కాంగ్రెస్‌ నేతల్లోని అసమర్థతను టీడీసీ అధినేత చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కృష్ణా బేసిన్‌లో నీళ్లు లేవని కోదాడ సభలో ఏపీ ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో కీలు బొమ్మ ప్రభుత్వం ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, కేసీఆర్‌ ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబుకు తెలుసన్నారు. కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏపీ నుంచి వేల కోట్లు పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలు చేశారని, తెలంగాణ నుంచి పంపించారనే కసితో ఆయన ఉన్నారన్నారు. మరోవైపు అధికారం నుంచి దూరం చేశారని కాంగ్రెస్‌ నేతలకు కడుపు మంటగా ఉందని విమర్శించారు. ఈ రెండు కత్తులు దూసుకొస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను బానిస కానివ్వనన్నారు. బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

‘చాలా కష్టపడి అనేక పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మనది. త్యాగాల పునాదులపై వచ్చిన తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందాలి. దుఃఖం లేని తెలంగాణ చూడాలన్నదే నా లక్ష్యం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు. మన ప్రాజెక్టులు నిండాలి, పంటలు పండాలనేది నా ఆశయం. గత నాలుగేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో, ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారు. పేదల కంట కన్నీరు రాని తెలంగాణ నా స్వప్నం. దుఖంలేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు సాగునీరు కచ్చితంగా పారేలా నేను యజ్ఞం చేస్తున్నా. ఇది కొనసాగాలి. ఈ యజ్ఞం, ఈ ప్రయాణం ఆగొద్దు. తెలంగాణ గెలిచి నిలవాలి. నవ్వేటోళ్ల ముందు జారిపడొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ఓటు వేయాలి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ నేతలు ఆశ్చర్యపోయారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ సంక్షేమంలో ముందుంది. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించి ప్రజలకు 24గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. దేశంలో విద్యుత్‌ తలసరి వినియోగంలో మనమే ముందున్నాం. రూ.42వేల కోట్ల మేర ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం’ అని కేసీఆర్‌ అన్నారు.

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణ దుర్మార్గుల పాలు కావొద్దు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి ఆగం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణలో 700 అడుగులు బోరు వేస్తే కానీ నీళ్లురాని పరిస్థితి. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఆనాడు కిరణ్‌కుమార్‌ రెడ్డి అంటే కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించలేదు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే కోటి ఎకరాలకు సాగునీరు.. తెలంగాణకు కాళేశ్వరం పూర్తవుతుంది. చంద్రబాబు కూటమి గెలిస్తే తెలంగాణకు శనీశ్వరం. దొంగ సర్వేలు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దు. 100కుపైగా స్థానాల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాను. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలు ఇస్తాం’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu