కరోనా కారణంగా సినిమా షూటింగులు, టీవీ కార్యక్రమాల షూటింగులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే .కాగా మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. షూటింగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఫైలుపై కూడా సంతకం చేశారు. అయితే.. పరిమిత సిబ్బందితో షూటింగులు జరుపుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. షూటింగులు పూర్తయిన వాటికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే థియేటర్లను తెరిచేందుకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతించలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు థియేటర్లను తెరవడానికి అనుమతిని నిరాకరించింది.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్, థియేటర్లకు అనుమతిని ఇవ్వాలని కేసీఆర్‌కు విన్నవించారు. వీరి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్… విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి తలసాని, సీఎస్ సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదాను రూపొందించారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాలీవుడ్ కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి.