సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికులకు తీపికబురు వినిపించారు. సింగరేణి కార్మికులకు అసెంబ్లీ వేదికగా దసరా పండుగ కానుకను ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ. 1,00899ను బోనస్‌గా ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయ్యిందన్న కేసీఆర్… యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అందరూ బాధ్యతగా యుతంగా పనిచేయడం మూలంగానే సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి దోహదపడిందన్నారు.
ఇక, 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగితే.. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ వస్తుందన్న సీఎం కేసీఆర్.. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్ టన్నులకు చేరిందని ప్రశంసించారు. గత ఐదేళ్లలో ఇది ప్రతీ ఏటా లాభాలు పెరుగతూ.. 2018-19 నాటికి రూ. 1765 కోట్ల లాభాన్ని సింగరేణి ఆర్జించిందన్నారు సీఎం.. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. మరోవైపు 2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369ను చెల్లాంచామని.. ఈసారి లాభాల్లో వాటాను 28 శాతానికి పెంచుతున్నామని ప్రకటించారు. లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00899 బోనస్‌గా అందుతుందని.. ఇది గతేడాది కన్నా రూ.40,530 అదనంగా తెలిపారు. ఇక, దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుకగా అభిర్ణించారు సీఎం కేసీఆర్.
https://www.youtube.com/watch?v=B1IdEkRbxlM