తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నో మున్సిపాలిటీ ఎన్నికలు చూశాని కానీ ఇంతటి స్థాయిలో టీఆర్‌ఎస్ గెలుపొందడం ఓ రికార్డు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుందని.. ఇంతటి హవాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీలకు చెంప చెళ్లుమనిపించేలా ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు.
అన్ని చోట్లా ఒకే తరహాలో ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధికే ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఎన్నికలను ఆపేందుకు విపక్షాలు చాలా ప్రయత్నాలు చేశాయని, అన్ని రకాల ప్రజలు ఉండే పట్టణ ప్రాంతాల్లో
ఇలాంటి ఫలితాలు రావడం చాలా అరుదని కేసీఆర్ అన్నారు. తాను, కేటీఆర్ ప్రచారానికి కూడా వెళ్లలేదని, ఈ ఎన్నికల్లో తాను ఏ అధికారితోనూ మాట్లాడలేదని, ప్రతిపక్షాలు అధికార దుర్వినియోగం చేశామని ఆరోపించాయని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున కేవలం రూ. 80 లక్షలు ఖర్చు చేశామని కేసీఆర్ తెలిపారు.