ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసింది. చివరిరోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఉదయం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుటుంబసభ్యుల సమక్షంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గానికి 26 పథకాలకు సంబంధించిన రూ.1327 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు.
కేవలం తొలి విడతగానే వీటిని మంజూరు చేశామని.. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేయాల్సి ఉందని జగన్ అన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తనకు ధైర్యం చెప్పి అండగా ఉన్న పులివెందుల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మరో దఫా నియోజకవర్గ పర్యటనకు వచ్చినపుడు గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని సీఎం ప్రకటించారు. పులివెందులలో నిరుపయోగంగా మారిన అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ స్పష్టం చేశారు.