ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని విమర్శించారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. అన్నీ తెలిసీ ప్రతి అడుగులోనూ మోసానికి పాల్పడ్డారన్నారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఏదైనా చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతానని.. చేస్తానని చెప్పి మోసం చేయడం తన నైజం కాదన్నారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కాదని సీఎం అన్నారు.
కాపులను మోసం చేయడం వల్లే టీడీపీకి సీట్లు తగ్గాయనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో కాపులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని.. ఖర్చు చేయకుండా వదిలేశారన్నారు. దస్త్రాల్లో ఉన్న లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరేంటి అని చంద్రబాబు అడిగారని.. అయితే ఈ ప్రశ్న వేసేముందు కనీసం ఆయన ఆలోచించరా? అని జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని.. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నా ఆయన వైఖరి ఇంకా మారలేదని తీవ్రస్థాయిలో జగన్ దుయ్యబట్టారు. ప్రస్తుత బడ్జెట్‌లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించామని సీఎం వివరించారు. జగన్ ప్రసంగం అనంతరం అధికార, విపక్షాల ఆరోపణలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేశారు.