ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై సీఎం జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వైఖరిని తప్పుపట్టారు. కరోనా వైరస్ బూచితో ఎన్నికలు వాయిదా వేయడం సరికాదన్నారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కరోనా సోకే ప్రమాదం ఉందని, అలాగే బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలున్న వారికి కరోనా సోకితే క్రిటికల్ అవుతుందని చెప్పారు. ఏపీలో 74 మందికి వైద్య పరీక్షలు చేశామని ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని అన్నారు. కరోనాతో మన దేశంలో ఇద్దరు మాత్రమే చనిపోయారని అన్నారు. కరోనాకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనాను సాకుగా చూపి స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆయన మండిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామన్నారు.
ఇది రెండు మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదన్నారు. ఈ చర్యలు సుమారు ఏడాదిపాటు కొనసాగుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం నిర్వహించాల్సి వస్తుందని అనుకోలేదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల వాయిదాపై కనీసం ప్రభుత్వ అధికారులతో చర్చించలేదని ఆరోపించారు. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారన్నారు. విచక్షణాధికారం పేరుతో ఈసీ రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ విచక్షణను కోల్పోయారని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. చంద్రబాబు హయాంలోనే రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించారని అన్నారు. ఈసీకి కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే బేధాలు చూపకూడదని అన్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? ఈసీకి ఈ అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.