ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రైతు సమస్యలపై చర్చలో భాగంగా టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించడంతో సభలో దుమారం చెలరేగింది. ఈ పథకం గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రవేశపెట్టగా.. తమ ప్రభుత్వం సైతం దాన్ని కొనసాగించిందని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి టీడీపీ విమర్శలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రైతాంగానికి గత టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని.. అవసరమైతే రికార్డులు తీసుకొస్తానన్నారు. సున్నా వడ్డీకింద రైతాంగానికి ఎంత డబ్బు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. దీంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.
జగన్ సవాల్‌ను చంద్రబాబు తిప్పికొట్టారు. రికార్డుల్లో ఉన్నది చెప్పడం తన బాధ్యత కాదన్నారు. ఒక ముఖ్యమంత్రి లెక్కలేనితనంతో మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఎవరి విధానాలు వారికి ఉంటాయని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనంతో మాట్లాడాలన్నారు. ఇష్టారీతిన అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారన్నారు. సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వండి.. తప్పులేదు.. కానీ టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలకు తక్కువ ఇచ్చారు అనడం సరికాదని మండిపడ్డారు. ‘వైఎస్ హయాంలో 14500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వారందరికీ రూ.7లక్షలు కాదు.. రూ.10లక్షలు ఇవ్వండి చెప్పుకోండి’ అని చంద్రబాబు అన్నారు.