HomeTelugu Big Storiesఏపీలో733గ్రామాల్లో ఫొని ఎఫెక్ట్.. ప్రాథమిక అంచనాలను వెల్లడించిన సీఎం చంద్రబాబు

ఏపీలో733గ్రామాల్లో ఫొని ఎఫెక్ట్.. ప్రాథమిక అంచనాలను వెల్లడించిన సీఎం చంద్రబాబు

6 2ఒడిశా, కోస్తాంధ్ర ప్రాంతాలను వణికించిన ‘ఫొని’ తుఫాను గమనంపై ఆర్టీజీఎస్‌ అంచనాలు నిజమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాను కదలికలపై ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్‌ అధికారులు కచ్చితమైన సమాచారం ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేశారని ప్రశంసించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. శుక్రవారం ఉదయం ఫొని పూరీ వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తోందన్నారు. ఈ తుఫాను ప్రభావం మొత్తం 14 మండలాలపై తీవ్రంగా ఉందని సీఎం వెల్లడించారు. మొత్తం 733 గ్రామాలు ప్రభావితమయ్యాయని, 408 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, మిగతా గ్రామల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాథమికంగా నష్టం అంచనా సుమారు రూ.10 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఈ తుఫాను నేపథ్యంలో కమ్యూనికేషన్‌ను ఎంతో సమర్థంగా వాడుకున్నట్టు చెప్పారు. మొత్తం 783 హెక్టార్ల మేర హార్టికల్చర్‌ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రోడ్లు పునరుద్ధరణ పనులు చేపట్టామని, మొత్తం 232 పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 182 సెల్‌ఫోన్‌ టవర్లను పునరుద్ధరించామన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, మందస, ఇచ్చాపురం మండలాల్లో అధిక వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసిందన్నారు. గతంలో తిత్లీ తుఫాను సైతం ఇక్కడే ఎక్కువ ప్రభావం చూపించిందని గుర్తుచేశారు. ఇచ్చాపురంలో నిన్న ఒక్కరోజే 20సెం.మీల వర్షపాతం నమోదైనట్టు చంద్రబాబు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తుఫాను సమాచార పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

ఫొని తుఫాను తీవ్రత ఒడిశాలో అధికంగా ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో నిన్న, ఈ రోజు మాట్లాడినట్టు చంద్రబాబు తెలిపారు. ఒడిశా ప్రభుత్వానికి ఆర్టీజీఎస్‌ నుంచి సమాచారం ఇస్తున్నామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ సేకరిస్తున్నామని, సాంకేతికతను అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని సీఎం చెప్పారు. తుఫాను గమనం, వర్షపాతం, గాలుల వేగాన్ని కచ్చితంగా అంచనా వేస్తున్నామని, ఐదేళ్లలో కాల్‌ సెంటర్‌ నుంచి అవేర్‌ వరకు వచ్చామని గతంలో వచ్చిన తుఫాన్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రస్తుత సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ చర్యలతో రేపు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా ప్రజలకు భరోసాగా ఉంటారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ముందే అధికారులు అంచనా వేయడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏప్రిల్‌ 27న బంగళాఖాతంలో తుఫాను ఏర్పడటం, 29న అది ఫొనిగా మారుతుందని అంచనా వేసినప్పటి నుంచే ఆర్టీజీఎస్‌ పని ప్రారంభించిందన్నారు. తుఫాను కదలికలపై ట్రాకింగ్‌ పెట్టడం వల్ల ఏ దిశలో, ఎంత వేగంగా పయనిస్తుందో, ఎంత నష్టం వాటిల్లుతుందో అధికారులు అంచనా వేస్తూ వచ్చారని చెప్పారు. దీంతో ఆయా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామని సీఎం తెలిపారు. పూరీ వద్ద తీరం దాటుతుందని కచ్చితంగా ఆర్టీజీఎస్‌ అంచనా వేసిందన్నారు. బాధితులకు ఆహారం పంపిణీలో గతంలో కంటే భిన్నంగా మిడ్‌డే మీల్‌ స్కీమ్‌ కింద అక్కడి నుంచే భోజనం అందించగలిగామన్నారు. ఈసారి 1,14,504 మందికి ఆహారం పంపిణీ చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భోజనం అందుబాటులో ఉంచనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu