ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏకబిగిన మూడున్నర రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్ ఫౌండేషస్ మాస్‌కాంక్రీట్ విధానంలో పునాది వేస్తున్నారు. 13 అడుగుల లోతు, 12 వేల క్యూబిక్ మీటర్ల మేర ఫౌండేషన్‌కు ఏర్పాట్లు చేశారు.
69.8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. 40 అంతస్థులతో నాలుగు, 50 అంతస్థులతో ఒక భవన నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ ఐదు సచివాలయ భవనాల్లో ఒకటి, రెండు టవర్లను షాపూర్జీ పల్లోంజీ, మూడు, నాలుగు టవర్లను ఎల్ అండ్ టీ, ఐదో టవర్‌ను ఎన్‌సీసీ సంస్థలు నిర్మించనున్నాయి.
రాఫ్ట్ ఫౌండేషన్ విధానం అంటే..
నిర్ణీత ప్రాంతం మొత్తాన్ని కాంక్రీట్‌తో నింపే ప్రక్రియనే రాఫ్ట్ ఫౌండేషన్ విధానంగా పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే స్టీలు, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి
కాంక్రీట్ దిమ్మెను నిర్మించడమే.
– సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్ పోయాలి.. కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే రాఫ్ట్‌లో అయితే మూడు రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్ విధానంతో పోలిస్తే ఖర్చు ఎక్కువైనా నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది.
నేల స్వభావానికి అనుగుణంగా
-నేల స్వభావానికి అనుగుణంగా భవన విస్తీర్ణం, ఎత్తుకు తగినట్లు పునాది ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఫైల్ ఫౌండేషన్ విధానంలో పనులు చేస్తున్నారు. సచివాలయ భవనాలకే రాఫ్ట్ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. 72 గంటలపాటు నిరాటంకంగా పనులు చేస్తారు. మూడోపార్టీగా వ్యవహరిస్తున్న ఐఐటీ చెన్నై నిపుణులు కాంక్రీట్‌మిక్స్‌ను డిజైన్ చేశారు.
భారీ యంత్రాల వినియోగం
– 60, 40 టన్నుల సామర్థ్యపు క్రేన్లు
– 10 మీటర్ల వరకు వినియోగించే హైడ్రాస్
– కాంక్రీట్ వేసే నాలుగు పంపులు
– 30 ట్రాన్సిట్ మిక్సర్లు (అందుబాటులో అదనంగా మరో ఆరు)