మహాకూటమి విఫలమైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆక్రోశంతో మాట్లాడుతున్నారంటూ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా కూటమి విఫలం కాలేదని, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, మోడి, అరుణ్ జైట్లీ విఫలమయ్యారని అన్నారు. దేశంలో రెండే కూటములు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే, దానికి మద్దతు పలుకుతున్న పార్టీలు కాగా, రెండోది కాంగ్రెస్, దానికి మద్దతు పలికే పార్టీల కూటమిలేనని వివరించారు.
ప్రధాని మోడి వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. కేంద్రం సాధించిన వృద్ధి ఏంటి? నోట్ల రద్దు, జీఎస్టీతో మీరు ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. మోడి నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని మోడిని దుయ్యబట్టారు. ప్రధాని మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ప్రచారం చేసినా తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటే గెలవగలిగారని ఎద్దేవా చేశారు. కేంద్రం అనుసరించిన ఆర్థిక, పాలనాపరమైన విధానాలు దేశానికి ఎంతో నష్టాన్ని కలిగించాయని అన్నారు.