AP elections 2024: తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవలకు దిగాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలను సముదాయించినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపాయి. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఎవరు అధైర్యపడవద్దని, తానున్నానని భరోసా ఇచ్చారు మోహిత్ రెడ్డి. మోహిత్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గ్రామానికి వచ్చారు. గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని, పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. పోలీసు బలగాలు భారీగా మోహరించడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మరోవైపు ఏపీలో మూడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ గడువుగా ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటివరకు క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే.. అరకు 51.08 శాతం, పాడేరులో 40.12 శాతం, రంపచోడవరంలో 65.33 శాతం పోలింగ్ నమోదైంది.