HomeTelugu Big Stories'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' నిషేధం లేదు

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ నిషేధం లేదు

6 27మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా రాజకీయ వివాదాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సినిమాపై ఎలాంటి నిషేధం విధించట్లేదని వెల్లడించింది.

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా పై నిషేధం విధించాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ యోచిస్తున్నట్లు శుక్రవారం ఉదయం వార్తలు వచ్చాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సినిమా విడుదలపై నిషేధం విధించాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అటు కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ నరేంద్ర సలుజా కూడా ఈ వార్తలపై మాట్లాడారు. ‘ఈ సినిమా గురించి చర్చించాలని కూడా మేం అనుకోవట్లేదు. ఆందోళనలతో చిత్రానికి అనవసర పబ్లిసిటీ కల్పించబోం. సినిమా విడుదలపై నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా పార్టీ నుంచి రాలేదు’ అని నరేంద్ర తెలిపారు.

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్’ మూవీ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. దీంతో వివాదం మొదలైంది. ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే వాస్తవాలను వక్రీకరించినట్లుందని, సినిమాను ముందే ప్రదర్శించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ట్రైలర్‌ను బీజేపీ ట్వీట్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అనుపమ్‌ ఖేర్‌ మన్మోహన్‌ పాత్ర పోషించగా.. సోనియాగాంధీగా సుసాన్నే బెర్నెట్‌, ప్రియాంక గాంధీగా అహనా కుమ్రా, రాహుల్‌గాంధీ పాత్రలో అర్జున్‌ మాథుర్‌ నటించారు. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu