కేరళలో కరోనా వైరస్ కారణంగా.. రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని వారు తెలిపారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. కేరళలో తాజాగా ఆరు కరోనా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేరళలో వైరస్ పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 12కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలు బహిరంగ సమావేశాలు, ఇతరత్రా బహిరంగ ఉత్సవాలకు మార్చి 31వరకు దూరంగా ఉండాలని సూచించారు.