తమిళనాడులో సినిమా థియేటర్ల యజమానుల సంఘాలు మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న 8 శాతం వినోద పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వినోద పన్నుతో పాటు ఇతర కారణాలు, ఖర్చుల వల్ల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని ఆందోళన చెందుతూ ఈ ఏడాది మే నెలలోనే థియేటర్ యజమానుల సంఘం ఓ ప్రకటన చేసింది. అప్పట్లో తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు స్టార్ హీరోలు సైతం షాక్‌కు గురయ్యారు. థియేటర్ యజమానుల డిమాండ్లు సబబు కాదని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని దర్శకుడు భారతీరాజా అన్నారు.
తాజాగా వినోద పన్నును రద్దు చేయాలన్న డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చాయి థియేటర్ల యాజమాన్యాలు. అంతే కాకుండా పెద్ద చిత్రాల ద్వారా నష్టపోతే ఆ చిత్ర నటీనటులు, నిర్మాతలే భరించాలని డిమాండ్ చేశారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను వంద రోజుల వరకు డిజిటల్ విభాగాల్లో విడుదల చేయకూడదని డిమాండ్ చేసింది. తమ నిర్ణయాన్ని కాదని డిజిటల్‌లో విడుదల చేస్తే ఆ నిర్మాతల సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. తమ డిమాండ్లు అంగీకరించకపోతే మార్చి 1 నుంచి తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లు మూసివేస్తామని థియేటర్ల యజమానుల సంఘం ప్రకటించింది.