ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) అధ్యక్షుడిగా పాపులర్ టెలివిజన్ సిరీస్ ‘సీఐడీ’ దర్శక-నిర్మాత బ్రిజేంద్ర పాల్ సింగ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది అక్టోబరులో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న పదవి నుంచి వైదొలిగారు.
సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ‘సీఐడీ’ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సిరీస్ 21 ఏళ్లుగా ఎటువంటి అంతరాయం లేకుండా సోనీ టీవీలో ప్రసారమవుతోంది. 2004లో సింగ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ‘సీఐడీ’ లోని 111 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్‌కే దక్కింది.
ఈ సందర్భంగా సింగ్‌కు ఎఫ్‌టీఐఐ పుణె డైరెక్టర్ భూపేంద్ర కైన్‌థోలా స్వాగతం పలికారు. ‘ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే అన్ని విషయాలపై సింగ్‌కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్‌టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఎడ్యుకేషన్ ‘స్కిల్ ఇండియా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ఆలోచన సింగ్‌దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు.