బాలీవుడ్ నటుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను ఏర్పాటు చేశారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ అధ్యక్షుడు, హీరో చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమితాబ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘అమిత్ జీ రూ.1500 విలువజేసే 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో అద్భుతమైన చొరవ చూపినందుకు బిగ్ బికి ‘బిగ్’ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు’ అని చిరు ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికులకు ఆయన ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. టాలీవుడ్‌లోని సినీ కార్మికుల కోసం చిరు చొరవతో ప్రముఖులంతా కలిసి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. ఈ నగదుతో ఛారిటీలోని సభ్యులు కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు.