టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో పాటు ఫ్యామిలీతో కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. కొరటాల శివ సినిమాకు ఇంకా టైమ్ ఉండటంతో కటుంబానికి కావాల్సినంత సమయం కేటాయిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మనవరాలితో సరదా ముచ్చట్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు చిరు. ఎప్పుడూ ఇంటి నిండా పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయడం చిరంజీవి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటున్న 64 ఏళ్ల మన మెగాస్టార్.. ఒకప్పుడు చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లతో ఆడుకునేవాడు. ఇప్పుడు వాళ్ల పిల్లలతో ఖాళీ సమయం కేటాయిస్తున్నాడు చిరంజీవి.
ఇప్పుడు కూడా ఓ మనవరాలితో కూర్చుని తన సినిమా కథ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా తన చూడాలని ఉంది సినిమా కథ చెబుతున్నాడు. అందులో తన కొడుకును ఒకరు కిడ్నాప్ చేస్తారని.. అప్పుడు తానెళ్లి కాపాడతానంటూ చెప్తున్నాడు చిరు. ఇక మనవరాలు కూడా చాలా శ్రద్ధగా తాతయ్య చెప్పే కథను వింటుంది ఈ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే కొరటాల శివ సినిమాను డిసెంబర్‌లోనే పట్టాలెక్కించాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.