కరోనా వైరస్ దేశంలో విజృభిస్తుంది. ఏ వైపునుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో అని ప్రాణాలు చేతబట్టుకుని జీవనం సాగిస్తున్నారు ప్రజలు. దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యంగా రోజువారి కూలీ చేసుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. రెక్కడితే గానీ డొక్కాడని వారు చాలామందే ఉన్నారు. చాలా కుంటుంబాలు సరైన తిండి కూడా లేక అలమటిస్తున్నాయి. కొందరు మాస్కులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో సామాజిక సృహ ఉన్నవారు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొంతమంది డబ్బు రూపంలో వారిని ఆదుకుంటుంటే.. మరికొంత మంది సమయానికి ఆహారాన్ని అందిస్తూ.. ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా దాదాపు 700 పైగా మాస్క్‌లు కుట్టారు. అంతేకాదు వాటిని అవసరమున్నవారికి అందజేస్తున్నారు. అలా ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఈ సామాజిక సృహను మనం అందరిలో చూడలేము. ఈ వయస్సులో సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు చూసి నెటిజన్స్ ఫిదా అవ్వడమే కాకుండా భావోద్వేగం చెందుతున్నారు.