మెగాస్టార్ చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా అందరికీ సుపరిచితమే. చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి, తన మంచి పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రాలకు కూడా తనే కాస్ట్యూమ్స్ డిజైన్ పని చేస్తుంది. అయితే సుస్మిత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కెరీర్ ని మరో మలుపు తిప్పేందుకు ఇప్పుడామె నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ నిర్మాతగా కూడా మారుతున్నారు.
‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ముందుగా వెబ్ సీరీస్ నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు. నిన్ననే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఓటీటీ వేదికలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో వాటి కోసం ఆమె పలు వెబ్ సీరీస్ లను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ముందుగా తమ మెగా ఫ్యామిలీ హీరోలతో ఆమె సినిమాలు కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే మెగా ఫ్యామిలీ నుండి మరో నిర్మాత రాబోతున్నట్లే. కాగా ఇప్పటికే రామ్ చరణ్, నాగాబాబు, పవన్ కల్యాణ్ కూడా పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.