సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి తాజాగా ఓ ట్వీట్ చేశారు.
‘‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’’ అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
కాగా చిరంజీవికి సత్యనారాయణతో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి హీరోగా నటించిన చాలా సినిమాల్లో సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు. ‘యముడికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘బావగారూ బాగున్నారా’ వంటి సినిమాల్లో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.