యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘బబుల్‌గమ్’. ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ కనకాల కాన్ఫిడెన్స్ చూసి నాని కూడా ఆశ్చర్యపోయారు. అస్సలు తడబాటు లేకుండా మాట్లాడుతున్నాడని.. కాన్ఫిడెంట్ మామూలుగా లేదని సుమ ఎదుటే కొనియాడారు.
అంతేకాదు, ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లను హోస్ట్ చేసే సుమ.. తన కొడుకు కోసం ఆ స్టార్ హీరోలందరినీ రంగంలోకి దించుతారని ఆరోజు నాని అన్నారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. ‘బబుల్‌గమ్’ సినిమా నుంచి రెండో పాట ‘ఇజ్జత్’ ఈనెల 23న విడుదలకానుంది. ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నారు.
నాని చెప్పినట్టే ఇండస్ట్రీకే బాస్ మెగాస్టార్‌ను దించుతున్నారు సుమ. ఇక దీంతో రోషన్ కనకాలకు మరింత ప్రచారం దక్కనుంది. ఇప్పటికే విడుదలైన ‘హబీబీ జిలేబీ’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ పాటను చిరంజీవి విడుదల చేస్తున్నారని కాబట్టి కచ్చితంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. మరి శ్రీచరణ్ పాకాల ఈ పాటకు ఎలాంటి ట్యూన్ ఇచ్చారో చూడాలి.
ఈ సినిమా తో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.