Chiranjeevi To Venkatesh: మూవీ ఇండస్ట్రీలో రీమేక్ కథలను టచ్ చేయని హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పాలి. తమ కెరీర్‌లో స్ట్రెయిట్ స్టోరీస్ కంటే రీమేక్ కథలతోనే ఎక్కువగా సినిమాలు చేసిన స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు నేటితరం స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ వరకు స్టార్ హీరోలందరూ రీమేక్‌లను టచ్ చేసిన వారే. వీరిలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన స్టార్లు ఎవరో తెలుసా!
చిరంజీవి: తెలుగులో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసిన హీరోల్లో చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. నలభై ఐదేళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు చిరంజీవి 38 రీమేక్ సినిమాలు చేశాడు. బాపు డైరెక్షన్లో వచ్చిన మనవూరి పాండవులు చిరంజీవి కెరీర్‌లో ఫస్ట్ రీమేక్ మూవీ. కన్నడ మూవీ పడువరాల్లి పాండవరు సినిమా ఆధారంగా మనవూరి పాండవులు తెరకెక్కింది. చిరంజీవికి స్టార్‌గా నిలబెట్టిన ఖైదీ మూవీ కూడా రీమేక్ కావడం గమనార్హం.
రీమేక్ కథలతో చిరంజీవి చేసిన ఆరాధన, విజేత, పసివాడి ప్రాణం, రాజా విక్రమార్క, ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కూడా తమిళ మూవీ కత్తి ఆధారంగా రూపొందింది. గత ఏడాది భోళా శంకర్ సినిమాలో నటించాడు చిరంజీవి. అజిత్ హీరోగా నటించిన వేదాళం రీమేక్‌గా భోళాశంకర్ రూపొందింది. హిందీలో చిరంజీవి నటించిన ది జెంటిల్‌మన్, ఆజ్ కా గుండారాజ్, ప్రతిబంధ్ కూడా రీమేక్ కథలతోనే రూపొందాయి.
వెంకటేష్ :1987 లో రిలీజైన భారతంలో అర్జునుడు నుంచి కిసీకా భాయ్ కిసీ కీ జాన్ వరకు తన కెరీర్‌లో ఇప్పటివరకు 32 రీమేక్ సినిమాలు చేశాడు వెంకటేష్. చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో అత్యధికంగా రీమేక్ సినిమాల్లో నటించిన హీరో వెంకటేష్. చంటి, చినరాయుడు, రాజా, సూర్యవంశం, దృశ్యం వంటి రీమేక్ సినిమాలతో వెంకటేష్ బ్లాక్‌బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.
నాగార్జున: రీమేక్ మూవీతోనే నాగార్జున కెరీర్ ఆరంభమైంది. హిందీ మూవీ హీరో స్ఫూర్తితో నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ రూపొందింది. ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. తమిళంలో విజయవంతమైన పురింపు మరియం జోస్ ఆధారంగా నా సామిరంగ తెరకెక్కింది. నాగార్జున కెరీర్‌లో ఇది 21వ రీమేక్ మూవీ. చిరంజీవి, వెంకటేష్ తర్వాత తెలుగు హీరోల్లో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించింది నాగార్జునే. నాగార్జున రీమేక్ సినిమాల్లో హలో బ్రదర్, నువ్వు వస్తావని, నిర్ణయం వంటి సినిమాలు హిట్టయ్యాయి.
బాలకృష్ణ: హీరోగా బాలకృష్ణ ఇప్పటివరకు చేసిన 109 సినిమాల్లో కేవలం 17 మాత్రమే రీమేక్ సినిమాలు ఉండటం గమనార్హం. మంగమ్మగారి మనవడు, మువ్వగోపాలుడు, పలనాటి బ్రహ్మనాయుడు, గొప్పింటి అల్లుడు, లక్ష్మినరసింహా, లయన్ వంటి రీమేక్‌లలో బాలకృష్ణ నటించాడు. బాలకృష్ణ చేసిన రీమేక్ సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్‌లే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం స్ట్రెయిట్ కంటే రీమేక్ సినిమాలతోనే కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రూపొందుతోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ బాలకృష్ణ కెరీర్‌లో పదిహేనవ రీమేక్ మూవీ. పవన్‌కు ఖుషి, గబ్బర్‌సింగ్, తమ్ముడు, వకీల్‌సాబ్ వంటి రీమేక్ సినిమాలే స్టార్‌డమ్‌ను తీసకొచ్చాయి.