మెగాస్టార్ చిరంజీవి.. ప్రతిష్టాత్మకంగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన `సైరా నరసింహారెడ్డి` బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.. మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపం, దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం, రామ్‌చరణ్ నిర్మాణ విలువలతో హిట్‌టాక్ సొంతం చూసుకున్న ‘సైరా’ బాక్సాఫీస్ వద్ద సై.. సై.. అంటోంది.. భారీ అంచనాలతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో కొణెదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్ చరణ్ నిర్మించారు. ఇక, ఫస్ట్ షో నుండే హిట్‌టాక్‌తో దూసుకెళ్తుంది సైరా.. రివ్యూస్ కూడా దాదాపు అన్నీ పాజిటీవ్‌గా రావడం కూడా ఈ చిత్రానికి కలిసివచ్చింది. విడుదలైన రోజే దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. మరోవైపు విదేశాల్లోనూ సైరా సత్తా చాటుతున్నాడు ఫస్ట్ డేనే దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు సమాచారం.
విమర్శకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవీ అమెరికా ప్రీమియర్ షోలలో 308 లొకేషన్లలో 8,57,765 డాలర్స్ అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.6.16 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆసీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ దక్కాయి.. ఆస్ట్రేలియాలో 39 లొకేషన్లలో 189,237 డాలర్లు సాధించినట్లు సమాచారం. ఫస్ట్ రోజే యూఎస్‌లో వన్ మిలియన్ మార్కును దాటేసినట్టు సైరా టీమ్ ప్రకటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇదే దూకుడు చూపిస్తే.. రెండు మూడు రోజుల్లో లాభాల బాట పట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరక్కెక్కిన ‘సైరా’.. మరి ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.