టాలీవుడ్ యంగ్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం శ్రీకారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. శర్వానంద్ ను తమ కుటుంబంలో ఒకడిగానే భావిస్తామని స్పష్టం చేశారు. తమకు రామ్ చరణ్ ఎలాగో, శర్వానంద్ కూడా అంతేనని వివరించారు. శర్వా తమ కుటుంబంలో కలిసిపోతాడని పేర్కొన్నారు. ఓసారి అతడితో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆపై శంకర్ దాదా ఎంబీబీఎస్ లోనూ తనతో శర్వా నటించాడని చిరంజీవి తెలిపారు.
ఇక శ్రీకారం చిత్రం గురించి చెబుతూ… నా బిడ్డ శర్వానంద్ కు ఆల్ ది బెస్ట్ అంటూ దీవించారు. వ్యవసాయం అవసరం, గొప్పతనం గురించి వివరించే చిత్రమిదని అన్నారు. వ్యవసాయం ఆవశ్యకతను అందరికీ వివరించేందుకు సరైన సమయంలో వస్తున్న చిత్రం అని పేర్కొన్నారు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల కాబోతుంది.