మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ పరాజయంపై పెదవి విప్పారు.
“కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని.. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 ఏళ్లలోనే ఎన్నో ఎదుర్కొన్నాను. మానసికంగా శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం నేర్చుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత.. సినిమాలు పరాజయాలు నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. అలానే విజయాన్ని తలకెక్కించుకోలేదు” అని అన్నారు.
“సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కానీ మన వర్క్ లో మనం బెస్ట్ ఇస్తాం. ‘ఆచార్య’ వైఫల్యం నాపై ఏమాత్రం ప్రభావం చూపదు. ఎందుకంటే అది డైరెక్టర్ ఛాయిస్. ఆయన ఏది చెబితే అది చేశాం. చరణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అతనిని కూడా ఆ ఫెయిల్యూర్ పెద్దగా ప్రభావితం చేయదు. చరణ్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. సినిమా రిజల్ట్ తన చేతిలో ఉండదని తనకి తెలుసు”
”ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క విచారం ఏంటంటే.. అది చరణ్ నేను కలిసి మొదటిసారి చేసిన సినిమా.. పరాజయం పాలైంది. ఒకవేళ భవిష్యత్తులో మేమిద్దరం మళ్లీ కలిసి నటించే అవకాశం వచ్చినా.. అంతటి జోష్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.