తమిళంలో హిట్ అయిన ‘‘శతురంగ వెట్టై” చిత్రాన్ని తెలుగులో ‘‘బ్లఫ్ మాస్టర్” పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, నందితా శ్వేత హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి గోపీ గణేష్ డైరెక్షన్ వహించాడు. 2018 డిసెంబర్ 28న విడుదలైన ‘‘బ్లఫ్ మాస్టర్’’ మంచి స్పందన తెచ్చుకుంది. సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చూశారు.
లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటోన్న చిరంజీవి పలు చిన్న సినిమాలను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చూశారు. ఈ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలుపించుకుని అభినందించారు. ఈ విషయాన్ని గోపి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
‘విశాల హృదయుడు అయిన మెగాస్టార్ నా ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చూశారు. నన్ను ఇంటికి పిలిచి అభినందించారు. సినిమా చూసి, నన్ను ప్రశంసించినందుకు ప్రియమైన చిరంజీవి సార్‌కి ధన్యవాదాలు. విశాల హృదయం కలవారు మాత్రమే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు విశాల హృదయులు. నా గురించి మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ నా హృదయంలో పదిలంగా ఉంటాయి. థాంక్యూ సార్’’ అని గోపి ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, చిరంజీవితో దిగిన ఫొటోను కూడా ట్వీట్లో షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరు క్లీన్ షేవ్‌తో, మీసం లేకుండా కనిపించారు. కాగా, ఈ ట్వీట్‌ను కాసేపటికే గోపీ గణేష్ డిలీట్ చేశారు.