ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావికొండలరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ లను విషాదాలు వెంటాడుతున్నాయని, రావి కొండలరావు ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయన మరణవార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. చిత్ర పరిశ్రమ బహుముఖ మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రావి కొండలరావుది సుదీర్ఘ ప్రయాణం అన్నారు. ఆయనకు ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం ఉందని చిరంజీవి తెలిపారు. తాను హీరోగా పరిచయం అయినప్పటి నుంచి రావికొండలరావుతో కలిసి పలు చిత్రాల్లో నటించానని గుర్తుచేసుకున్నారు.
తమ కాంబినేషన్‌లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా రావికొండల రావు మరణం ఒక తీరని లోటన్నారు. రావి కొండల రావు ఆయన సతీమణి రాధా కుమారి జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేదని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.