టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శనివారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చూడాలని గవర్నర్‌ను చిరంజీవి ఆహ్వానించారు. త్వరలోనే సినిమా చూస్తానని ఆమె చెప్పారు.
కాగా, ఈనెల 2న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం. దసరా పండుగ సెలవులు ఉండటంతో వసూళ్లు మున్ముందు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.