దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో గత రెండు నెలలుగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. సినిమా పరిశ్రమ సైతం లాక్‌డౌన్ వలన మూత పడిపోయింది. ‘లాక్‌డౌన్ 4’ సమయంలో చాలా వరకు సడలింపులు ఇచ్చారు. పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. దేశీయంగా విమానాలు నడవబోతున్నాయి. జూన్ 1 నుంచి కొన్ని రైళ్లు కూడా పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రాల్లో బస్సులు కూడా తిరుగుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ.. శుభ్రతను పాటిస్తూ ప్రజలు విధి నిర్వహణకు వెళ్తున్నారు.
అయితే, లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరుకు సినిమా షూటింగులుకు బ్రేక్ రావడంతో కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. ఇండస్ట్రీ పై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. ఎలానో సడలింపులు ఇస్తున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కీలక చర్చలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. వీరిద్దరితో పాటు ఇండస్ట్రీ పెద్దలంతా సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చిస్తున్నారు.
నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.