Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరటంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవికి భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చింది. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం తాజాగా సత్కరించింది.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన వేడుకను ఘనంగా నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక చిరంజీవి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి స్పందన అంతగా లేదనే వార్తలు వినిపించాయి. దీనిపై చిరంజీవి తన అసహనాన్ని తన ప్రసంగం ద్వారా పరోక్షంగా వ్యక్తం చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సత్కరించడం గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది’. అవార్డులు ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంత త్వరగా కళాకారులను సత్కరించడం లేదని రేవంత్ రెడ్డిని కొనియాడారు.
అంతే కాదు ప్రస్తుత రాజకీయాలన్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో ముడిపడి ఉన్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయ నాయకులను తిప్పికొట్టాలని అన్నారు. అవార్డుల ప్రకటన తర్వాత జగన్ చిరంజీవికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పలేదని, సీఎంఓ నుంచి అధికారికంగా ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేశారని టాక్. దీంత పరోక్షంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు అంటున్నారు.