అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్న ప్రతి మహిళలకు నమస్కరిస్తున్నా. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైన రోజు అనిపించింది.
అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీ అందరి కష్టం చూస్తుంటే మా అమ్మ గారి కష్టం గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. తన కష్టం చూశాను కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం. నేను స్త్రీ పక్షపాతి అవటానికి కారణం నా తల్లి ,భార్య సురేఖ’ అని అన్నారు. అంతేగాక ప్రస్తుతం మహిళలు అంతరిక్షం వరకు వెళుతున్నారని, ప్రతి ఒక్కరు మహిళలను గుర్తించాలన్నారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన భార్య సురేఖ గురించి మట్లాడారు. ‘నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి నా భార్య సురేఖ కారణం. ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆమె చూసుకుంటుంది. నేను సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంట్లో నా తమ్ముళ్లను, పిల్లలను చూసుకునేది. నేను సినిమాలపై శ్రద్ధ పెడుతున్నానంటే తనే ప్రధాన కారణం.’ అని ఆయన పేర్కొన్నారు. చివరగా టికెట్ల జీవో అంశంపై రిపోర్టర్ చిరంజీవిని ప్రశ్నించగా.. సినిమా టికెట్ల జీవో గురించి ఇప్పుడు మాట్లాడనని, ఇది సందర్బం కాద అన్నారు. దీని గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతాను అని ఆయన తెలిపారు.