మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది సాయం చేశారాయన. అయితే తను ఒక హీరోగా, మంచి వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి భార్య సురేఖనే కారణం అని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సురేఖ గొప్పతనాన్ని వివరిస్తూ ఉప్పొంగిపోయారు చిరంజీవి. ‘కోకాపేటలో నాకు కొన్ని ఎకరాల స్థలం ఉంది. అక్కడ ఒక ఫామ్‌హౌస్ కట్టుకుని పొలం పనులు చేసుకుందామనుకున్నా. ఇప్పుడా భూమి ధర కోట్లు పలుకుతోంది. విషయమేంటంటే.. నా చెల్లెళ్లకు ఇళ్లు కట్టించాను, వారి బిడ్డల భవిష్యత్తు చూసుకున్నాను. వాళ్లు కూడా మంచి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారికి ఏమీ చూసుకోనవసరం లేనంత స్థితిలో ఉన్నారు.’
‘కానీ సురేఖ.. ఎలాగో మన దగ్గరున్న భూమి ధర రేటు పెరిగింది కదా, అందులో కొంత మీ చెల్లెళ్లకు ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. ఏ మహిళ కూడా ఆడపడుచులకు అంత ఆస్తి ఇవ్వాలనుకోదు, కానీ సురేఖ.. ఆ భూమి నా చెల్లెళ్లకు ఇస్తే భవిష్యత్తులో వారికి ఆసరాగా ఉంటుందని భావించింది. మంచి సలహా ఇచ్చావని మెచ్చుకున్నాను, ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయాను. రక్షా బంధన్‌కు కొన్ని రోజుల ముందు మరోసారి ఆమె ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఆ రెండెకరాలు రాఖీ పండగ రోజు బహుమతిగా ఇవ్వండి అని చెప్పి అన్ని పనులు తనే పూర్తి చేసింది. పండగ రోజు రాఖీ కట్టినప్పుడు స్థలం డాక్యుమెంట్లు చెల్లెళ్లకు ఇవ్వడంతో వారు షాక్ తిన్నారు’ అంటూ సురేఖ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు చిరంజీవి.