మెగాస్టార్ చిరంజీవి, మాస్‌మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్‌లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గతకొన్నేండ్లుగా సినీపరిశ్రమను చుట్టుముడుతున్న రాజకీయాంశాలను ప్రస్తావించారు.
‘మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి?’ అని మండిపడ్డారు.
2014 తర్వాతి నుంచి కేవలం సినిమాలకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల ‘బ్రో’సినిమా విషయంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలోనే చిరంజీవి ఇలా స్పందించినట్లుగా చర్చ జరుగుతోంది.