దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
”దిశ” ఘటనలోని నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూశాను. నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన అకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి..! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసు పరిష్కారం కావడం అభినందనీయం. సజ్జనార్ లాంటి ఆఫీసర్లు ఉన్న పోలీసు వ్యవస్థకి, కేసీఆర్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు’
అని చిరంజీవి తెలిపారు.