అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్‌మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు.
అంతేకాదు క్రాంతి కుమార్‌కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు.