మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61గంటల 20 నిమిషాల పాటు వీణావాదన చేసి గిన్నిస్‌ను సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు, భారతీయులందరి అదృష్టమని పేర్కొన్నారు.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రానికి వీణాపాణి సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా గౌరవించటం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణమని చిరంజీవి పేర్కొన్నారు. కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలని, అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. వీణాపాణి అసలు పేరు రమణమూర్తి కాగా ఆయనకు వీణాపాణి అని తనికెళ్ళ భరణి నామకరణం చేశారట.