సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 3(తమిళ వెర్షన్) కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-3లో తమిళ నటుడు శరవణన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ.. ‘నేను అమ్మాయిల్ని ముట్టుకోవచ్చన్న కారణంతోనే కాలేజీకి బస్సుల్లో వెళ్లేవాడిని’ అన్నారు. దాంతో కమల్ హాసన్‌తో పాటు అక్కడున్న ఇతర కంటెస్టెంట్లు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ పగలబడి నవ్వుకున్నారు. ఈ ఎపిసోడ్ టీవీలోనూ ప్రసారమైంది. ఈ నేపథ్యంలో చిన్మయి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘అమ్మాయిల్ని ముట్టుకోవచ్చనే బస్సుల్లో ప్రయాణించేవాడినంటూ ఓ వ్యక్తి గర్వంగా చెప్పుకొంటున్న వీడియోను ఓ తమిళ ఛానల్ ప్రసారం చేసింది. పైగా అతని వ్యాఖ్యల పట్ల చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్న వారికి ఇది జోక్‌గా అనిపిస్తోందా?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
చిన్మయి ట్వీట్‌పై పలువురు నెటిజన్లు సానుకూలంగా, మరికొందరు ఘాటుగా స్పందించారు. అయితే ఒక యువతి మాత్రం చిన్మయికి మద్దతు తెలుపుతూ తాను బస్సులో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఓ లేఖలో రాశారు. ఆ లేఖలో.. ‘శరవణన్‌లాంటి వారికి బుద్ధిచెప్పినందుకు ధన్యవాదాలు చిన్మయి. అమ్మాయిల్ని ముట్టుకోవడానికే బస్సులు ఎక్కడమనేది ఇలాంటివారికి జోక్‌గా ఎలా అనిపిస్తోందో నాకు అర్థంకావడంలేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్‌కు బస్సులో వెళుతుంటే ఓ వృద్ధుడు ఎక్కడపడితే అక్కడ చేతులేశాడు. అలా ఎందుకు చేశాడో అర్థంకాలేదు. దాంతో అక్కడే ఉన్న ఓ అన్నకు చెప్పాను. అతను సాయం చేయకపోగా నన్ను తన వద్దకు లాక్కుని మరింత వికృతంగా ప్రవర్తించాడు’
‘కొన్ని రోజుల పాటు ఈ బాధను భరించాను. అమ్మకు చెప్పడానికి భయపడ్డాను. రెండేళ్ల తర్వాత ఈ వేధింపులను భరించలేక నన్ను నేనే గాయపరుచుకునేదాన్ని. ఇదో అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు నేను వాటి నుంచి కోలుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. బిగ్‌బాస్‌లో శరవణన్ అన్న మాటలు జోక్‌గా తీసుకోవాల్సినవి కావు. ఇదెంతో బాధాకరం. మాలాంటి బాధితుల తరఫున మీరు గళం విప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. లవ్యూ చిన్మయి అక్కా’ అని పేర్కొంది. ఈ లేఖను చిన్మయి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ నాపై కామెంట్లు చేస్తున్నవారు ఓసారి ఈ లేఖను చదవండి’ అన్నారు.
A Tamil channel aired a man proudly proclaiming he used the Public Bus Transport system to molest/grope women – to cheers from the audience.
And this is a joke. To the audience. To the women clapping. To the molester.
Damn. https://t.co/kaL7PMDw4u
— Chinmayi Sripaada (@Chinmayi) July 27, 2019