ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన పట్ల జరిగిన సంఘటనల గురించి బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయిందని బాధపడుతున్నారు. తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తనపట్ల ప్రవర్తించిన తీరును వెల్లడిస్తూ ఇటీవల చిన్మయి షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను చెప్పినందుకు సామాజిక మాధ్యమాల్లో తనపట్ల ద్వేషపూరిత, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిన్మయి వెల్లడించారు.
‘ట్విటర్‌లో నాకు రోజూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. అవన్నీ నాపై మరొకరు చేస్తున్న కామెంట్లే. ఇప్పుడు సమస్య జాతి, రాజకీయాల వరకు వెళ్లింది. నా స్నేహితులు, సన్నిహితులు నా గురించి ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు. నేను అన్ని విషయాలు బయటపెడుతున్నానని నాకు పనిలేకుండా పోయింది. అయినా పర్వాలేదు. ఇతర భాషలకు చెందిన పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నాను. ఎక్కడో ఒకచోట పని దొరక్కుండాపోదు. కానీ నా బాధేంటంటే.. నాకు నచ్చిన పని నుంచి నన్ను దూరం చేశారు. నేను తీసుకున్న రిస్క్ ఏ ఆడపిల్లా తీసుకోవడానికి ధైర్యం చేయదు’ అని వెల్లడించారు చిన్మయి.