ఇటీవల సాహిత్య రచయిత వైరాముత్తు వేధింపుల గురించి మాట్లాడిన గాయని చిన్మయి శ్రీపాద శనివారం ఓ మహిళకు మద్దతు తెలుపుతూ ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ తనను వేధించారంటూ ఓ మహిళ (పేరు చెప్పలేదు) పాత్రికేయురాలు సంధ్య మేనన్‌కు మెసేజ్ చేశారు. దాన్ని ఆమె ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
‘హాయ్ సంధ్య.. నేను సింగర్ కార్తీక్ గురించి మాట్లాడాలి. ఈ విషయంలో నేను గుర్తు తెలియని మహిళగా ఉండటమే మంచిది. కొన్నేళ్ల క్రితం నేను, కార్తీక్ ఓ పబ్లిక్ కార్యక్రమానికి హాజరయ్యాం. అక్కడ కార్తీక్ నా శరీరం గురించి తప్పుగా మాట్లాడారు. నన్ను ముట్టుకోవాలని ఉందంటూ.. అసభ్యంగా కామెంట్లు చేశారు. ఆరోజు నేను ఏ మాత్రం సౌకర్యంగా ఉండలేకపోయాను, ఆయనపై అసహ్యం పుట్టింది. ఆయన్ను కలవాల్సి వచ్చిన ప్రతిసారి దగ్గరికి వెళ్లాలంటే భయపడిపోయేదాన్ని. పలువురు సింగర్స్ ఆయనపై ఫిర్యాదు చేశారని కూడా విన్నాను. ఆయన ప్రముఖ గాయకుడు, పరిశ్రమలో పేరుంది.. కాబట్టి నేను ఎవరో తెలియకపోవడమే మంచిదని భావిస్తున్నా. టూర్స్‌కు వెళ్లినప్పుడు మహిళా సింగర్స్‌ను వేధించేందుకు ప్రయత్నించే ఈ వ్యక్తికి సిగ్గులేదు’ అని మహిళ సంధ్యకు సందేశం పంపారు.
సదరు మహిళకు చిన్మయి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు. కార్తీక్ ఎప్పుడూ తన పాపులారిటీని తప్పుగా ఉపయోగించుకునేవారని అన్నారు. చాలా మంది మహిళల వెంటపడేవారని చెప్పారు. అసభ్యకర ఫొటోలు, సందేశాలు, వీడియోలు పంపిస్తుంటారని, కార్తీక్ వేధింపులకు తాను కూడా బాధితురాలేనని చిన్మయి పేర్కొన్నారు.