మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో 19నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ట్విటర్‌లో వరుస ట్విట్లతో అనేక ప్రశ్నల్ని, విమర్శల్ని లేవనెత్తారు. ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ అక్రమాలు, డబ్బింగ్ ఫీజులో 10శాతం వసూలు తదితర విషయాలపై ఆమె స్పందించారు.
ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఫీజు చెల్లించినా తప్పుడు ఆరోపణలతో తనను అక్రమంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించిన లైఫ్ మెంబర్‌షిప్ (జీవితకాల సభ్యత్వం) చెల్లించినట్టు వెల్లడించారు. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో యూనియన్‌వాళ్లు తనకు రసీదును ఇవ్వలేదని చెప్పారు. రిసీట్ చూపించని కారణంగా డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని నిరాకరించారని తెలిపారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించకోలేదన్నారు. తాను లైఫ్‌మెంబర్‌షిప్ చెల్లించినా, తనను యూనియన్ సభ్యురాలిగా తొలగించడంపైనా, అసలు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు. కేవలం రాధా రవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగానే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
అలాగే తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించి తనతో కలిసి మొత్తం 97మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని యూనియన్ చెబుతోందన్నారు. యూనియన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి సభ్యత్వాన్ని తొలగించారని, అయితే వారు కోర్టుద్వారా కొంతమంది సభ్యత్వాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు డబ్బింగ్ యూనియన్‌పై భూమా సుబ్బారావు అనే ఆర్టిస్టు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దాదాపు 16 ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు. దీంతోపాటు గత నెలలో నమోదైన ఎఫ్‌ఐఆర్, చార్జిషీటు వివరాలను కూడా చిన్మయి ట్వీట్ చేశారు.
తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్‌లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిలపై పలు ఆరోపణలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదంటూ యూనియన్ నుంచి తొలగించినట్టు అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే
Here is the video. The statement that I didn’t pay the dubbing union subscription fee is false. 👇🏼https://t.co/1TVsdgeasM
— Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2018
And there are 16 cases against the Dubbing Union. They keep liars and more liars to drum to their tunes else they’d also be kicked out of work. Pathetic. pic.twitter.com/HUa5H2IIh6
— Chinmayi Sripaada (@Chinmayi) November 24, 2018