చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండురోజుల పర్యటనకు భారత్ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి మహాబలిపురం శోర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా మోదీ పంచెకట్టులో కనిపించారు. మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన వెయ్యేళ్ల నాటి కట్టడాలు, చారిత్రక వైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. వీరి పర్యటన నేపథ్యంలో మహాబలిపురంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మోదీ జిన్‌పింగ్‌లు శోర్ ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్దిసేపు సేదతీరారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచరథాలు కొలువుతీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఇక మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్స్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం లంచ్ ఏర్పాటు చేస్తారు.