ఆదిమానవుడి నుంచి.. ఆధునిక మానవుడి వరకు మనిషి ప్రస్థానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నింటా జ్ఞానం పెంచుకుని అబ్బురపరిచే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలతో జీవనాన్ని సులభరతం చేసుకుంటూ వీటికి అనుగుణంగా అలవాట్లను, పద్ధతులను కూడా మార్చుకుంటున్నారు. అయితే ప్రజలు ఎన్ని అలవాట్లు మార్చుకున్నా మూఢనమ్మకాలను మాత్రం మార్చుకోవటం లేదు. రోగాలు నయం అవుతాయన్న నమ్మకంతో చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….
మూఢనమ్మకాల పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో అంగ వైకల్యం కలిగిన పిల్లల పట్ల తల్లిదండ్రులు, స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నారులను మెడ వరకు మట్టిలో పూడ్చిపెట్టి అమానుష చర్యకు పాల్పడుతున్నారు. సూర్యగ్రహణం రోజు అలా చేస్తే అంగ వైకల్యం నయం అవుతుందని వారి నమ్మకం. పిల్లలు రోధిస్తున్నా గ్రహణం ముగిసే వరకు అలానే మట్టిలోనే ఉంచారు. ఉత్తర కర్ణాటక వ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయంటే.. ప్రజలు మూఢనమ్మకాలను ఎంతగా నమ్ముతారో అర్థమవుతోంది. స్థానికులను ఈ మూఢ నమ్మకం నుంచి బయటపడేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా ఆ ప్రాంత వాసుల్లో మాత్రం మార్పు కనిపించట్లేదు. అక్కడి ప్రజలు కొన్ని ఏళ్లుగా ఈ మూఢ నమ్మకాన్ని అనుసరిస్తున్నారు.