బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకరి తర్వాత మరొకరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ యువతికి చేతన్ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఆ మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను షీనా అనే యువతి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై తాజాగా చేతన్ ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు.
‘నా మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌పై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆ స్క్రీన్‌షాట్స్ చూడటం ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ముందుగా నా వల్ల ఇబ్బందిపడిన నా భార్య అనూషాకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్‌షాట్స్‌లో ఉన్నదంతా నిజమే. నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. అయితే ఈ స్క్రీన్‌షాట్స్ కొన్నేళ్ల క్రితం తీసినవి. ఆ యువతిని నేను చాలాసార్లు కలిశాను. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని నేను మెసేజ్‌లలో కూడా పెట్టాను. ఆమె మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది. నాకు పెళ్లి అయినప్పటికీ కొంతకాలం పాటు భార్యతో కనెక్టివిటీని మిస్సయ్యాను. నేను మాత్రమే కాదు ఆ యువతి కూడా నాతో మెంటల్‌గా కనెక్ట్ అయినట్టుంది. ఆమె చేసిన మెసేజ్‌లను బట్టి అది అర్థం అవుతోంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మా మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. ఇద్దరం ఎలాంటి అసభ్యకర ఫొటోలు పంపుకోలేదు. నేను కలిసిన వారిలో ఆ యువతి ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. ఏదేమైనా ఆ అమ్మాయితో నా వ్యక్తిగత విషయాలు పంచుకుని ఉండాల్సింది కాదు. మరోసారి ఆ యువతికి, నా భార్యకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు చేతన్.