ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ . రెహమాన్ పై చీటింగ్ కేస్ కూడా నమోదైంది. వైద్య నిపుణుల సంఘం చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై వైద్య నిపుణుల సంఘం 2018లో రెహమాన్ తో మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేసుకునే దిశగా చర్చలు జరిపింది. దీంతో అడ్వాన్స్ గా సంఘం రెహమాన్ 29.50 లక్షలు చెల్లించింది.
అయితే అనివార్య కారణాలతో ఆ కచేరి రద్దయింది. అప్పటి నుంచి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి చెల్లించమని వైద్యం సంఘం పలుమార్లు విజ్ఞప్తి చేసినా రెహమాన్ ఆ మొత్తాన్ని చెల్లించలేదుట. పలుమార్లు కలిసి తమ సమస్య చెప్పుకున్నా రెహమాన్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఇక లాభం లేదనుకున్ని చెన్నై పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ పై చీటింగ్ కేసు ఏంటని? అభిమానులు మండిపడుతున్నారు. ఎక్కడో తప్పు జరిగిందని… దేశం గర్వించదగ్గ సంగీత దిగ్గజంపై ఇలాంటి కేసులేంటి? అని ప్రశ్నిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేసి అసలు విషయాలు ప్రేక్షకాభిమానులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెహమాన్ కొంత కాలంగా సినిమాలకంటే ఎక్కువగా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ద్వారా వచ్చే పారితోషికం కంటే అధికంగా కచేరీల ద్వారా సంపాదిస్తున్నారు. దేశ..విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.